top of page

దేవుడు కలుగజేయు తప్పించుకొను మార్గము

Updated: Oct 1

తేనెధారలు


01, అక్టోబర్ 2024 మంగళవారము


చదువుము: 1 కొరింథీ 10:11-13


‘*‘సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు...’’ (1 కొరింథీ 10:13)*


కొన్ని వందల సం॥ల నుండి దేవుని ప్రజలకు ఈ వచనమెంతో అద్భుతమైన ఆదరణ ఇచ్చుచున్నది. మనవంటి శోధనలు మరెవరికి రాలేదని మనలో చాలామంది తలంచుదుము. కానీ, మనకంటే శోధన నెదుర్కొనినవారున్నారని గుర్తు పెట్టుకొనుడి. దేవుడు ఎంత నమ్మదగినవాడో అలాగే అంత జ్ఞాని గనుక తప్పించుకొను మార్గము కలుగచేయుననునది గొప్ప ధైర్యమిచ్చును. మనము సహించునంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనియ్యడు. మనమేమి భరించగలము, ఎంత భరించగలమో ఆయన ఎరిగియున్నాడు గనుక తన జ్ఞానమును బట్టి మన శక్తి చొప్పున శోధన ననుమతించును లేక దానిని భరించి, జయించునట్లు మనలను బలపరచును. ప్రతి శోధనతో ఉన్న సమస్త పరిస్థితులు ఆయన బాగుగా ఎరిగియున్నాడు మరియు ఆయన చిత్తము చొప్పున అనుమతించిన శోదన తప్ప ఏ ఒక్కటి కూడా మనకు రాదు.



ప్రియ మిత్రులారా, మనము ఆత్మతో నడుచుచున్నట్లయితే, యేసువలె నడుచుకొనుచు ఉంటే మనము శోధన నెదుర్కొనినప్పుడు అది ఎంతో ఘోరమైనదిగా ఉన్నను మనము క్రీస్తునందు అత్యధిక విజయము పొందినవారముగా దాని నుండి బయటకు రాగలమని నిశ్చయత కలిగియుండవచ్చు. మనము చేయవలసినదంత ఏమంటే దీనులమై తప్పించుకొనుటకు దేవుడు ఏర్పరచిన మార్గములో నడుచుకొనుటయే. శోధనలు, వాటిని తప్పించుకొను ఉపాయాలు రెండును జతగానే ఎల్లప్పుడు ఉండును ఎందుకనగా మార్గము కలుగజేయునది దేవుడే. ఆయన ఎన్నడు అన్యాయమును అనుమతించడు. పరిస్థితులకు బలి కావలెనని దేవుడెన్నడు అనుమతించడు. సమస్తము ఆయన స్వాధీనంలో ఉండును మరియు వీటియన్నిటియందును ఆయన నమ్మకత్వము వెల్లడి అగును. గనుక మనము నిరాశ చెందరాదు. మనము బయటకు వచ్చు మార్గము లేని అంధకారలోయ ఏదియు లేదు, మనము తప్పించుకొని, ఎంతో విజయవంతంగా బయటకు రాలేని ఎంతో బాధాకరమైన శ్రమ ఏదియు లేదు. సమస్తము జయించగలము.



*ప్రార్దన*:- ప్రియ ప్రభువా, నీవు నా మీద ఉంచిన భారములు మోయలేనంతగా కనిపించినను, నేనెంత మోయగలనో నీవెరిగియున్నావు గనుక నీ నిత్యమైన బాహువులు నా క్రింద ఉన్నవి. ఆ భారము క్రింద మునిగిపోకుండా నీ కృపచేత నేను మోయగలను. నీ శక్తి, నీ కృప చేత జయించు మార్గమును నాకు చూపుదవని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page