చదువుము : అ.కార్య 3:1-10,16
నీకు ఉత్తమమైనది కలదు - అది యేసు నామమే !
‘‘... వెండి, బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము.’’ - అ.కార్య 3:6
1983లో 180 మంది ప్రార్థన బృందము వారు నేపాలు దేశమును దర్శించిరి. వారిలో కొందరు వైద్యులుండిరి. అక్కడ వారొక మెడికల్ క్లినిక్ పెట్టి చాలామందికి వైద్యము చేయగా స్వస్థతలు జరిగినవి. ఒక రోజు అన్యమత పూజారి ఒకరు తన ఐదు సం॥ల కుమార్తెను తీసికొని వచ్చెను. ఆమె రెండు కాళ్ళు చచ్చుబడినవి. ఏ వైద్యము పనిచేయలేదు. ఈ ప్రార్థనా గుంపులో ఉన్న వైద్యులు కూడా ఏమి చేయలేకపోయిరి. అయితే వారు యేసు నామములో ! ఆమెకొరకు ప్రార్థించగా అత్యద్భుతము జరిగినది ! వైద్యుల ప్రయత్నము చేయలేనిది యేసు నామమందు చేసిన ప్రార్థన చేసెను. ఆమె లేచి తనంతట తానే నడచెను. ఆ పూజారి మరియు చూచుచున్న వారందరు యేసును వారి సొంత రక్షకునిగా అంగీకరించిరి. ఆ పూజారి ధైర్యముతో సువార్త పత్రికలను బయట పంచిపెట్టగలిగెను. హల్లెలూయా ! పేతురు, యోహానుల వద్ద డబ్బు, బంగారము, వెండి వంటివేమియు లేకపోగా యేసునామము తప్ప ఆ కుంటివాడైన భిక్షకునికి మరేదియు సాయము చేయలేకపోయెను ! అన్నిటికంటె తన కుమారుని నామమును పరలోకమందున్న తండ్రి హెచ్చించెనని బైబిలు చెప్పుచున్నది. ‘‘దేవుడు... ఆయనను సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారముకంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామము కంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు’’ (ఎఫెసి 1:20,21). యేసు నామమందు ఆధిపత్యము, అధికారము స్వస్థపరచుటకును, విడిపించుటకును, హెచ్చించుటకును అధికారమున్నది.
ప్రియ స్నేహితులారా, ఈ రోజులలో ప్రార్థన చేయు సువార్త బృందములనుండి భౌతికమైన ఆహారము, వస్త్రములు, ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలను పొందవలెనను అనారోగ్యకరకమైన ఆశ జనులు కలిగియున్నారు. యేసుక్రీస్తును స్వీకరించుటకు బదులు బహుమానాలను మాత్రమే స్వీకరించి యేసును తిరస్కరించుచున్నారు. ఆ నామమందలి శక్తిని వారు రుచి చూచినప్పుడు వారాయనకు మొఱ్ఱపెట్టుదురు. అప్పుడు ప్రభువు వారి ఆత్మలను రక్షించుటతో పాటు వారి అవసరతలను కూడా తప్పక తీర్చును.
ప్రార్థన :- అన్ని నామములకు పై నామము గల యేసుప్రభువా, నీ నా రక్షకుడవైనందుకు నేనెంతో ధన్యుడను. నీ నామమును హెచ్చించుటకును, జనులు దానినుండి కలుగు శక్తిని, విడుదలను కూడా రుచి చూచునట్లు వారికిని నీ నామమును పరిచేయు కృపనిమ్ము. వారి అవసరతలతో బాటు నిత్య జీవమును కూడా పొందునట్లు సహాయము చేయుమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments