చదువుము : మార్కు 14:3-11
త్యాగపూరితమైన ప్రేమ
‘‘ఈమె తన శక్తికొలది చేసెను...’’ - మార్కు 14:8
ఇప్పటికి కూడా ఎంతో విస్తరించి మాట్లాడుచున్న ఒక స్త్రీ జీవితమును గూర్చి ఈ దిన వాక్యభాగంలో మనము చదువుదుము. మనము మెచ్చుకొనదగిన, మనలను పురికొల్పునట్టియు, అనుసరించుటకు మాదిరియునైన నిర్దిష్టమైన గొప్ప సుగుణాలు ఆమెలో మనకు కనబడును. మొదటిగా, ఆమెకెంతో ప్రశస్తమైన ఆ అత్తరును త్యాగముచేసి అర్పించుటకు లెక్కచేయనంతగా యేసుపట్ల ఆమెకు ప్రేమ ఉన్నది. ఆ అత్తరు స్వచ్ఛమైన అచ్చజటామాంసిjైు మిగుల వెలగలది. కొంతకాలము ఆమె కొద్దికొద్దిగా ధనము కూడబెట్టియుండవచ్చు. ఆ అత్తరు బుడ్డి పగులకొట్టి దానిలోని అచ్చ జటామాంసి అత్తరును ప్రభువు తలపై పోసిన ఆమె త్యాగమెంత గొప్పది ! మరొక అద్భుతమైన సుగుణమేమనగా యేసు నుండి తిరిగి ఏదియు ఆశించి దానిని చేయలేదు. ఆమెకు రహస్యమైన ప్రణాళిక ఏదియు లేదు. ఆయన వద్దకు వచ్చినవారందరు ఆయన నుండి ఏదో ఒకటి అనగా దయ్యములనుండి విడుదల లేక స్వస్థత లేక ఆహారము మొ॥న ఆశించియే వచ్చెదరు ! ఆమెలోని మూడవది, మాదిరికరమైన లక్షణమేమనగా యేసుకొరకు తన శక్తికొలది చేయుట ద్వారా ఆయన మెప్పు పొందెను. ఆయనకేదో ఒక తక్కువైనది ఇయ్యవలెనని కాక తన వద్ద ఉన్న శ్రేష్ఠమైనది ఇచ్చెను.
ప్రియ మిత్రులారా, మన పూర్ణ హృదయంతో యేసును మనము ప్రేమించుచున్నామా? ప్రేమిస్తే ఆయనకు మన ప్రేమను ఎలా చూపుచున్నామా ? లేకపోతే మనకున్న సంపద అనగా డబ్బు, హోదా లేక అలాంటి దేనినైన ఇంకను గట్టిగా పట్టుకొనుచున్నామా ? మనమీ విషయమును గుర్తుచేసికొందము. ఆమె ఒకవేళ తన కొరకే ఆ విలువైన అత్తరును దాచుకొనియుంటే ఆమె చరిత్రలో నిలిచేది కాదు. ఆ అత్తరు సువాసను బట్టి యేసు సంతోషించియుండవచ్చు కానీ దానికంటే మిన్నగా ఆమె చూపిన ప్రేమ, త్యాగము, సమర్పణలను బట్టి ఆమెను మెచ్చుకొనెను. దేవుని ప్రేమించుటకు, సంతోషపరచటకును అడ్డుగా ఉన్న మన మొండితనమంతటిని మరియు మనలను మనమే ప్రేమించుకొని స్వార్ధముగా ఉండుటను మనము కూడా తొలగించుకొందము.
ప్రార్థన :- ప్రియ ప్రభువా, పరిమళభరితమైన, ఫలభరితమైన దీవెనకు విరిగి నలిగిన మనసే కారణమని గ్రహించు కృపనిమ్ము. ఏ మాత్రము విలువలేని ఈ లోకపరమైన వాటిని నా కొరకే అట్టిపెట్టుకొనక యుండునట్లు మెడవంగని, స్వార్ధపూరితమైన స్వభావము నా నుండి తొలగించి భేషరతుగా నిన్నే ప్రేమించుటకు సాయము చేయుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments