చదువుము : 1 కొరింథీ 4:14-16
పౌలు - ఒక ఆత్మీయ తండ్రి
‘‘క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి...’’
-1 తిమోతి 1:12
పౌలుగారి పేరు చెప్పగానే ఆయన ఒక సువార్తకుడని, అపొస్తలుడని, ప్రార్థనా వీరుడని, సంఘమును హింసించినవాడని మొ॥ వాటిని గూర్చి మనము తలంచుదుము. వీటన్నిటికి తోడుగా ఆయన ఒక ఆత్మీయ తండ్రిగా పేర్కొనబడినవాడు. మొదటగా 1 కొరింథీ 4:14లో ఆయన ఆత్మీయ తండ్రి అని మనము చదువుదుము. కొరింథీ సంఘములో అనేకమంది ఆత్మీయ పిల్లల హృదయాలలో సువార్తను విత్తుట ద్వారా ఆయన తండ్రిగా వ్యవహరించెను. కొరింథీయులను ఆయన ‘‘నా ప్రియులైన పిల్లలారా’’ అని సంబోధించి ‘‘క్రీస్తుయేసునందు సువార్త ద్వారా నేను మీకు తండ్రినైతిని’’ అనియు చెప్పెను. ఆయన తిమోతికి కూడా ఆత్మీయ తండ్రిగా యుండెను. మొదటిసారిగా పౌలు దెర్బే మరియు లుస్త్రలో అతని రెండవ సువార్త యాత్రలో తిమోతిని కలిసికొనెను. (అ.కార్య 16:1-3). ఆ సమయమందు తిమోతి అప్పటికే విశ్వాసిగా ఉండెను. అతని గూర్చి బాగుగా ఎరిగియుండిన విశ్వాసుల సాక్ష్యము ద్వారా అతడు పౌలుకు పరిచయము చేయబడెను. ఈ యవ్వనస్థునిలోని ఆత్మీయ స్థితిని గ్రహించిన పౌలు తనతో ప్రయాణించుటకు అతనినాహ్వానించెను. అప్పటినుండి తిమోతి పౌలుకు ఒక కుమారునిగా, నమ్మకమైన జత పనివానిగా పౌలు మరణించు వరకు పనిచేసెను. తిమోతికి పౌలు ఇచ్చిన ఉపదేశము ఏదో తరగతి గదిలో ఇచ్చిన వర్తమానముగా కాక ఎంతో ఒత్తిడితో కూడిన జీవితంలోని ఎత్తు పల్లాల మధ్య చెప్పబడినది. మరి ముఖ్యంగా పౌలు బోధించినట్లే ఎలా జీవించెనో నిజంగా ప్రత్యక్షంగా చూచినవాడు తిమోతి. మూడవది, పౌలు థెస్సలోనీకయులకును ఆత్మీయ తండ్రి. ‘‘దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని యెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును’’ అని 1 థెస్స 2:11లో ఆయన చెప్పియున్నాడు. తీతుకు, సీల మరియు అనేకులకును పౌలు ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు.
ప్రియ మిత్రులారా, మనకు ఆత్మీయ తల్లిదండ్రులున్నారా ! ఉన్నారంటే, మన ఆత్మీయ జీవితాలలో వారి సాయము లేనిదే ఇంతగా ఎదిగేవారము కాము గనుక వారిని బట్టి దేవునికి వందనాలు చెప్పుదము. అలాగే మనమెవరికైనను ఆత్మీయ తల్లిదండ్రులుగా పనిచేస్తున్నామా ? లేనిచో ఈ యవ్వన తరము ప్రభువు కొరకు నిలిచి, ప్రకాశించునట్లు శక్తికొలది వారిని నడిపించుదము.
ప్రార్ధన :- ప్రియ ప్రభువా, నా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు. నేనును అనేక యవ్వనులకు ఆత్మీయ తల్లిగాను, తండ్రిగాను ఉండి, వారిని పురికొల్పి, ప్రోత్సాహపరచి, నీ మార్గాలలో నడిపించుటకు నాకు నీ జ్ఞానమిమ్ము. క్రీస్తు ప్రేమను వారును ప్రతిబింబించునట్లు వారికి మాదిరిగా ఉండు కృపనిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comentarios