14, ఏప్రిల్ 2025 సోమవారము || వ్యసనాక్రాంతుడైన యేసు
- Honey Drops for Every Soul
- 2 days ago
- 1 min read
తేనెధారలు చదువుము : యెషయా 53:1-7
‘‘అతడు తృణీకరింపబడినవాడును, మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిననుభవించినవాడుగాను...’’ - యెషయా 53:3
దేవదూతలు, ప్రధాన దూతలు చేత పొగడబడుచు, ఎవరి ఎదుట సాగిలపడుచుందురో ఆ సమస్త ఆనందానికి మూలమునైన, సమస్త సమాధానము ననుగ్రహించువాడునైన యేసుప్రభువు సమస్త వేదనాభరితుడని పిలువబడెను ! ఆయన భూమిమీద ఉండినప్పుడు వేదన ఆయన హృదయాన్ని బ్రద్దలు చేసినది, ఆయన ఆత్మ దు:ఖముచేత నలుగగొట్టబడినది. వ్యాకులమును ఆయనయు ఎంతో సమీప మిత్రులుగా ఉండిరి. ఈ ‘‘దు:ఖము’’ అను పదము యొక్క మూలము హెబ్రీ భాషనుండి వచ్చినదై విచారము చేత ఘోరమైన, మానసిక, భావోద్రేకమైన బాధ అని అర్థమిచ్చునదిగా ఉన్నది. ‘‘వ్యసనము’’ లేక ‘‘వ్యాకులము’’ అనగా సొమ్మసిల్లునంతగా తీవ్రమైన శ్రమ, బాధలననుభవించుటగా ఉన్నది. ఈ లోకరక్షకునిగా ఈ భూమిమీద యేసు నడుచుచున్నప్పుడు ఎడతెగక ఇక్కడ పాపము, దుష్టత్వమును చూచుచు ఆయన హృదయమెంతో వేదనకు గురియాయెను. సమస్త శారీరక, మానసిక శ్రమను ఆయన ననుభవించి, ఎరిగియుండెను. తలవాల్చుటకు కూడ స్థలములేని ఆయనకు పేదవారి చింతలు తెలిసేయున్నది. అన్ని విధాల స్థాయిలలో చింతలన్నియు ఆయనపైబడినవి. ఆయన తన జీవితకాలమంతయు ఒంటరితనము ననుభవించవలసి వచ్చెను. తన స్వకీయులే ఆయనను తిరస్కరించిరి. పరిసయ్యులాయనను తృణీకరించిరి. సిలువ వేయబడిన సమయంలో తన శిష్యులే తనను విడనాడిరి. తన తండ్రియే ఆయనకు ముఖము త్రిప్పుకొని తన సమస్త ఉగ్రతను ఆయనపై క్రుమ్మరించెను. ఎడతెగక శ్రమలు, తన చుట్టు ఉన్నవారి వేదనలను ఆయన ఎడతెగక సహించి, భరించినందున ఆయన ఎల్లవేళల దు:ఖాక్రాంతునిగా ఉండెను.
ప్రియ మిత్రులారా, ఇతరుల శ్రమలను చూచి అనేకులు ఏదో కొద్ది బాధపడుచుందురు. కానీ శ్రమనొందుట అనగానేమో ఆయన ఎరిగియుండెను గనుక ఆయన మనపట్ల కలిగియున్న ప్రేమను బట్టి మన శ్రమను ఆయన శ్రమగా తీసికొనెను. బాధ, వేదన ఎరిగియుండెను గనుకనే మన సమస్త బాధలలో ఆయన మనకు సహాయము చేయువాడైయున్నాడు. గనుక మన హృదయవేదనను మనమే భరించుచుండక ప్రార్థనలో వాటిని ఆయన పాదముల వద్ద పెట్టుదము.
ప్ర్రార్ధన :- ప్రియ ప్రభువా, నా బాధను నీ మీద వేసికొంటివి. నా దు:ఖము, చింతలను నీవిగా చేసికొంటివి. వాటిని నేనే మోయకుండునట్లు ఆ భారమును నీవే మోసికొనిపోతివి, వాటన్నిటిని ప్రార్థనలో నీ మీద వేసి నా సమస్త భారముల నుండి విడుదల పొందు కృపననుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comentários