top of page

12, నవంబర్‌ 2024 మంగళవారము || తేనెధారలు

చదువుము : కీర్తన 100:1-5


చర్చికి వెళ్ళుటకు తృష్ణకలిగియున్నామా ?



‘‘కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడాకొనుట మానక, ఒకనినొకడు హెచ్చరించుకొందము...’’ - హెబ్రీ 10:25


సంఘ ఆరాధనలకు హాజరు కాకపోవుటకు చాలామంది క్రైస్తవులు చెప్పే అనేక సాకులలో ఒక సాధారణమైనదేమనగా - ‘‘క్రైస్తవులందరు వేషధారులని - వారు పాటలు పాడుదురు, ప్రార్థించుదురు, చర్చిలో భక్తిను గూర్చి ఎంతగానో చెప్పుదురు కానీ వారి జీవితాలలో మాటలకు, చేతలకు పొంతన ఉండదు. దేవుడు ప్రతిచోట ఉన్నాడు, నా యింటిలో కూడా ఉన్నాడు. గనుక నా యింటిలో నాలుగు గోడలమధ్య ఆయనతో ప్రార్థనలో ఎందుకు కొంత సమయము గడపకూడదు ?’’ అని చెప్పుదురు. ప్రియ మిత్రులారా, వాదించుటకు పైన చెప్పబడిన కారణము కొంతవరకు నిజమే కావచ్చు కానీ క్రైస్తములమైన మనము తప్పక ఒకరితో ఒకరు కూడుకొని సహవాసము చేయవలెనని దేవుని వాక్యము తేటగా సూచించుచున్నది. ఇందుచేత ఒకరితో ఒకరు వ్యక్తిగతముగా మరింతగా మన క్రైస్తవ ప్రేమను పంచుకొనగలము. ఒకరినొకరము ప్రోత్సాహపరచుకొనుచు విశ్వాసమును బలపరచుకొనగలము. సహవాసమనేది ఒకరికొకరు ప్రేమతో పరిచర్య చేసికొనునట్లు చేయును. మనమొక వేళ చర్చికి వెళ్ళుటకు నిర్లక్ష్యము చేసి విశ్వాసుల సహవాసమునకు దూరమైతే మనము స్వార్ధపరులమగుదుము.



1 కొరింథీ 12లో విశ్వాసులకు మరియు మానవ శరీరంలో వివిధ అవయవాలకు మధ్య సంబంధమును పౌలు పోల్చి చెప్పుచున్నాడు. ‘‘ఒక భాగము శ్రమపడితే ప్రతి భాగము దానితోపాటు శ్రమపడును, మరియు ఒక భాగము హెచ్చింపబడితే ప్రతి దానితోపాటు ఆనందించును’’. ప్రతి క్రైస్తవుని వైఖరి ఇలాగే ఉండవలెను. గనుక ఇతరులను విమర్శించి, తీర్పుతీర్చకయుందము. దానికి బదులుగా సహోదర ప్రేమతో మన హృదయాలను నింపుమని పరిశుద్ధాత్మను వేడుకొందము. ఎవరును పరిపూర్ణులు కారు. మనతో సహా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పు ఉన్నది. గనుక ఇతరుల తప్పులు ఎత్తిచూపక వాటిని ప్రభువు పాదాల చెంతపెట్టి వారికొరకు ప్రార్థించుదము. దేవుని యొక్క సంఘము ఆయన నివాస స్థలము అని మనస్సునందుంచుకొందము. కావున అక్కడ సత్యముతోను, పరిశుద్ధతతోను, అత్యాసక్తితో ఆరాధింప ఆశ కలిగియుందము. ‘‘సైన్యములకధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు ! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది... నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము’’ అని కీర్తనాకారునితో కలిసి మనము చెప్పుదము (కీర్తన 84:1,2,10). విధేయత అను ఈ చిన్న విషయము ద్వారా ప్రభువు నామమున మహిమపరచుదము.



ప్రార్థన :- ప్రేమ గల తండ్రీ, విశ్వాసుల సహవాసమును నిర్లక్ష్యము చేస్తే నా ఆత్మీయ ఎదుగుదల క్షీణించును గనుక, అలా చేయక ఇతరులను విమర్శించుచు, చాడీలు చెప్పుకొనక పరిశుద్ధ స్థలములోనే నిన్ను ఆరాధించుటకు క్రమముగా వెళ్ళు కృపనిమ్మని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.


 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.co

Opmerkingen

Beoordeeld met 0 uit 5 sterren.
Nog geen beoordelingen

Voeg een beoordeling toe
bottom of page