11, ఏప్రిల్ 2025 శుక్రవారము || క్షమించుటలోని ఆనందము
- Honey Drops for Every Soul
- 5 days ago
- 1 min read
తేనెధారలు చదువుము : లూకా 15:21-32
‘‘ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి’’ - ఎఫెసి 4:32
తప్పిపోయిన కుమారుని ఉపమానమందు సాధారణంగా మనము పెద్దకుమారుని గూర్చి పెద్దగా పట్టించుకోము. అతడు కష్టించి పనిచేసెను, తన తండ్రికి ఎల్లవేళల విధేయుడై అతనికెన్నడును అవమానము తేలేదు. అయితే అతనిలో ఇన్ని మంచి లక్షణాలున్నను ఆ పెద్దవానికి కొన్ని పాపపు, చెడ్డ లక్షణాలుండి తన తండ్రి సహవాసములో ఆనందించలేకపోయెను. మొదటిది, తన ఆసక్తి వ్యర్థము చేసిన చిన్న కుమారుని తన తండ్రి దయతో క్షమించెను, గనుక అతడు తన తండ్రిని ప్రేమించలేదు మరియు అతడు తన సోదరుని కూడా ప్రేమించలేదు. ఎందుకనగా, అతడు కుటుంబ ఆస్తిని పాడుచేసి, కుటుంబానికి అవమానము కలిగించెను ! రెండవది, అతడు స్వనీతిపరుడు. తన సోదరుని తప్పిదాలను గూర్చి మాట్లాడెనే గానీ తన తప్పులు తాను చూచుకొనలేదు. తరువాత తప్పిపోయిన తన తమ్ముని గూర్చి అతడు లక్ష్యము చేయలేదు. తన చిన్న కుమారుడు తిరిగివచ్చునేమోయని ఆ తండ్రి ప్రతి దినము ఎదురుచూచెను కానీ పెద్దవాడు తన దాసులలో ఎవరో ఒకరు తన సోదరుని రాకను గూర్చి చెప్పువరకు అతడెరుగకపోయెను! అన్నిటిని మించి అతడు క్షమించువాడు కాదు ! తన తండ్రి, సహోదరుడు, ఇద్దరిపై అతనికి కోపముండెను. కనీసం ఇంటిలోనికి కూడా వెళ్ళక ఆ ఆనంద సమయాన్ని ఆస్వాదించలేకపోయెను. క్షమించుటలోని ఆనందమును, విడిపోయిన సంబంధాలు పునరుద్ధరింపబడుటను, కుటుంబం తిరిగి ఐక్యపరచబడుటలోని సంతోషాన్ని అతడు అనుభవించలేకపోయెను.
ప్రియ మిత్రులారా, దేవునితో సహవాసాన్ని అనుభవించకుండా అనేకసార్లు మనము కోపాగ్ని పెంచి పోషించుచుందుము. దేవునితో సహవాసము లేకుండా మన సహోదర, సహోదరీలతో సమాధానంగా ఉండలేము. అంతేకాదు, క్షమించలేని మనస్సుంటే దేవునితో సహవాసం చేయలేము. ఆ పెద్దవాని వలె ఉండకుండ జాగ్రత్తపడుదము గాక !
ప్రార్ధన:- ప్రేమగల పరలోక తండ్రీ, ఆ పెద్దకుమారుని వలెనే నాకు కూడా కొన్ని దుర్గుణాలున్నవి. నేను స్వనీతిపరుడనే. నా పొరుగువారిని, తోడివారిని ప్రేమించి, క్షమించేలేను కొన్నిసార్లు నా సొంత కుటుంబీలను కూడా క్షమించి ప్రేమించలేను. దయతో నన్ను క్షమించి అంగీకరించుమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Kommentarer