10, ఏప్రిల్ 2025 గురువారము || మన ఒంటరితనములో దేవుడుమనలను ధైర్యపరచును
- Honey Drops for Every Soul
- 6 days ago
- 2 min read
తేనెధారలు చదువుము : ఆది కాం. 28:10-22
‘‘... ఈ స్థలము ఎంతో భయంకరము ! ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే’’ - ఆది కాం. 28:17
యాకోబు ఏశావును మోసగించి వాస్తవానికి తమ తండ్రినుండి ఏశావుకు రావలసిన దీవెనలన్నియు తీసికొని తండ్రి యింటి నుండి యాకోబు పారిపోవుచుండగా త్వరలోనే చీకటి పడినందున ఒక రాతిని తలగడగా చేసికొని ఎన్నో భయాలతో అక్కడ నిద్రపోయెను. అప్పుడతనికి ఒక కల వచ్చినది. దానిలో ఒక నిచ్చెన పైభాగాన భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా నిలబడియుండెను. ‘‘... నేను... దేవుడైన యెహోవాను... ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరల రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను’’ అను ఈ 4 వాగ్ధానాలు ఆయన యాకోబునకిచ్చెను (ఆ.కాం. 28:13,15). ఎంత ప్రోత్సాహము ! యాకోబు నిద్రమేల్కొని ఆ చోటుకు ‘‘బేతేలు’’ అని పేరు పెట్టెను. అప్పుడు యాకోబు - ‘‘నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్ళుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను’’ (ఆ.కాం. 28:20-22). దేవుడు యాకోబు యొక్క నిబద్దతను ఘనపరచెను. యాకోబు తన మామ లాబాను యింట నున్నప్పుడు దేవుడతనిని ఎంతగానో ఆశీర్వదించెను. అనేక సం॥లైన పిదప యాకోబు తన తండ్రి యింటికి తిరిగి వచ్చినప్పుడు ‘‘నా చేతికఱ్ఱతో మాత్రమే యీ యోర్దాను దాటితిని, యిప్పుడు రెండు గుంపులైతిని !’’ అని సాక్ష్యమిచ్చెను. ఎన్నో సం॥ల క్రితము ఇచ్చిన వాగ్ధానములోని ప్రతి మాట తప్పక దేవుడు నెరవేర్చెను.
ప్రియ మిత్రులారా, మీరు ఒంటరి అని అనుకొనుచున్నారేమో కానీ మీరెక్కడ ఉన్నను దేవుడు మీతో ఉన్నాడు. సమస్తము కోల్పోతిమని తలంచుచున్నారేమో కానీ దేవుడు మీరు కోల్పోయిన సమస్తము అనేక రెట్లు తిరిగి దయచేయును. ఆమెన్.
ప్రార్ధన:- ప్రియప్రభువా, నా ఒంటరితనమందు నీవు నాతో ఉన్నావని తలంచినప్పుడు అదెంత ఓదార్పునిచ్చునో నా భవిష్యత్ నాకిప్పుడు అగమ్యగోచరంగా కనబడినను నీవు నన్నెన్నడు విడువవని, నేను కోల్పోయిన నా సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము మొ॥ సమస్తమును తిరిగి దయచేయుదువని యేసునామమున నమ్ముచున్నాను తండ్రీ, ఆమెన్
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments