చదువుము : అ.కార్య 8:1-4
సువార్త విత్తనము చల్లుటకు చెదరగొట్టబడును
‘‘ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి’’ (లూకా 14:1)
స్తెఫను హతసాక్షిjైున పిదప యెరూషలేములో సంఘము గొప్ప హింస నెదుర్కొనెను. అట్టి హింసతో కలిగిన ఒత్తిడి అక్కడి విశ్వాసులను సౌఖ్యంగా ఉన్న యెరూషలేమునుండి బయటకు వెళ్ళునట్లు చేసెను. వారనేక ప్రాంతాలకు చెదరిపోయిరి. ఏదేమైనను వారు వెళ్ళిన చోటనెల్ల దేవుని వాక్యము బోధించిరి. అయితే వారెవరు ? వారు అపొస్తలులా? కాదు శిక్షణ నొందిన సువార్తికులా ? కానే కాదు. వారు క్రీస్తునంగీకరించి విశ్వాసులైన సాధారణ స్త్రీ, పురుషులే. వీరందరును వారి గృహాలను కోల్పోయి వారికున్న వాటన్నిటిని, వారి కుటుంబస్థులైన వారిని సహా, విడిచి చెరసాలలోనికి కూడా వెళ్ళినవారు. ఇట్టివారు హింసకు భయపడి ఎక్కడో దాగుకొని యుండవలసినది. కానీ ఆశ్చర్యపరచు విధంగా వారు వాక్యము ప్రకటించుచు సంచరించిరి. ఇది ఎంతో మంచిది, మెచ్చుకొనదగినది. ‘‘వారేదో పారిపోయి తలదాచుకొనువారిగా కాక సువార్తికులుగా వెళ్ళిరి’’ అని ఎవెరెట్ హారిసన్ వ్రాసిరి. యేసుప్రభువును ప్రేమించిన ఆ స్త్రీ, పురుషులు లేదా ఆయన ప్రేమను బాగుగా ఎరిగినవారు మౌనంగా ఉండుట కష్టమే. 2 కొరింథీ 5:14 చెప్పుచున్నట్లు క్రీస్తు ప్రేమ వారిని బలవంతము చేసెను. సహజంగానే కష్టాలు, హింసలను గూర్చి ఫిర్యాదు చేయు మానవ స్వభావమున్నను వారి దానికి భిన్నంగా దేవుని మంచితనమును గూర్చి మాట్లాడిరి. ఒక చెరువు మధ్యలోకి ఒక రాయిని విసిరినట్లయితే అది అక్కడనుండి అలల వలయాలు ఒడ్డువరకు వచ్చునట్లు వారెక్కడికి వెళ్ళినను వారు సువార్తను ప్రకటించుచునే యుండిరి.
ప్రియ మిత్రులారా, దేవుడు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు అనగా ఉద్యోగం కోల్పోవుట, మరొక స్థలానికి మనలను తీసికొనిపోవుట మొ॥గు వాటిని అనుమతించి నప్పుడు మనమాయన హస్తమును, ఆయన శక్తిని చూచి, గ్రహించగలుగుచున్నామా ? ఆది సంఘములోని క్రైస్తవుల వలె మనమెక్కడికి వెళ్ళినను ప్రతిచోట దేవుని చిత్తమును అంగీకరించి ఆయన వాక్యమును ప్రకటించుదము.
ప్రార్ధన :- ప్రియ ప్రభువా, నేనొక నూతన ప్రదేశము పరిస్థితిలోనికి వెళ్ళునట్లు నీవనుమతించినప్పుడు సణగక ‘‘ఇక్కడ నేనెవరికి సాక్ష్యము చెప్పవలెను ?’’ అని ప్రశ్నించుకొని, అనుదినము నాకెదురయ్యే వారి మధ్య రక్షణ బీజాలను చల్లునట్లు కృపనిమ్ము. నిర్భయంగా సువార్తను ప్రకటించుటకు నీ ప్రేమ నన్ను బలపరచునట్లు సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ. ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.com
Comments