చదువుము : లూకా 13:1-5
మారుమనసు పొందు వారిని దేవుడు క్షమించును
‘‘అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును’’ - (సామె 28:13)
గలలీయులైన కొందరి రక్తమును పిలాతు బలులతో కలిపి అర్పించిన విషయమును కొందరు యూదులు యేసుతో చెప్పుట ఈ వాక్యభాగములో ఉన్నది. వారు పాపాత్ములు గనుకనే పిలాతు వారిని చంపెనని ఊహతోనే వారాయనకు చెప్పిరి. వారే నీతిమంతులని చెప్పుటయే వారి ఉద్దేశము. అయితే వారు ఊహించిన రీతిగా ఆశ్చర్యకరంగా యేసు వారికి వేరొక విధముగా జవాబిచ్చెను. ‘‘ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుచున్నారా ? కారని ! మీతో చెప్పుచున్నాను మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరును అలాగే నశింతురు’’ అని ఆయన గట్టిగా వారిని హెచ్చరించెను. జీవితంలో ఒక ముఖ్యమైన విషయము మీద వారి దృష్టి కేంద్రీకరించునట్లు ఆయన వారితో మనుష్యులందరు పాపులు గనుక వారికి ఒక రక్షకుడు కావలసియున్నది. అన్యులకు మాత్రమే కాదు గానీ దేవుని చేత ఏర్పరచుకొన్న వారమని తలంచు యూదులు కూడా పాపులే అని చెప్పెను. పాపులు విపత్తులను తప్పించుకొందురేమో కానీ మారుమనసు పొందకపోతే దేవుని తీర్పును తప్పించుకొనలేరు. బ్రదికియున్న వారు బ్రదికియున్నారంటే వారు మరణమునకు పాత్రులైనను దేవుడు కృప చూపుచున్నందుననే. యెవరును నశింపవలెనని యిచ్ఛయింపక అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడు గనుక ఆయన కనికరము, కృప, దయగలవాడై దీర్ఘశాంతము చూపుచున్నాడు (2 పేతురు 3:9).
ప్రియ మిత్రులారా, మారుమనసు పొందని పాపులు అందరు నిత్యము బాధనొందు నకరము నిజముగా ఉన్నదని బైబిలు స్పష్టముగా చెప్పుచున్నది. మారుమనసు పొంది దేవుని వేడుకొంటే పాపి తప్పక రక్షింపబడుననియు బైబిలు చెప్పుచున్నది. నశించకుండ రక్షించుటకే పాపులందరి కొరకు యేసు వచ్చెను. మీరు ఎన్నడైన మారుమనస్సు పొంది యేసునంగీకరించనివారైతే దేవుడు దయ, దీర్ఘశాంతము, సహనము గలవాడు గనుక మీకు మరొక అవకాశమిచ్చును. ఆ విధంగా మరొక అవకాశమిచ్చు దేవుడైనను ఒక నాటికి చివరి అవకాశమిచ్చు దేవుడగును. గనుక వాయిదా వేయక ఇప్పుడే పశ్చాత్తాపపడి ఆయనతో సమాధానపడుము.
ప్రార్ధన :- ప్రియ ప్రభువా, నీయొద్ద నా పాపాలు దాచక నన్ను నేను తగ్గించుకొని పశ్చాత్తాపపడుచున్నాను. దయతో క్షమించి యేసురక్తముతో నన్ను కడుగుము. నీవు ఉచితముగా అనుగ్రహించు కృపను పొందకుండ నిత్య తీర్పులోనికి వచ్చి నశించకుండ కృప చూపుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.com
Comments