06, ఏప్రిల్ 202 ఆదివారము || మొదట దేవుడు, తరువాత కుటుంబం
- Honey Drops for Every Soul
- Apr 6
- 2 min read
తేనెధారలు చదువుము : లూకా 9:59-62
"ఆయన - నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని యేసు వారితో చెప్పెను’’ - మత్తయి 4:19
మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుని కొక ప్రత్యేక ప్రణాళిక ఉన్నది. ఎవరికివారే జరిగించునట్లు ఆయన అట్టి పనులను మనకు అనుగ్రహించును, మరియు దానిని పూర్తిగా ముగించవలెనని ఆయనాశించుచున్నాడు. ఇవన్నియు ఒక దానిపై ఒకటి ఆధారపడియుండును. మనకు నియమించిన ఆ పని మనము చేయలేనట్లయితే దేవుని రాజ్య పరిచర్యలో భాగస్థులైన ఇతరులను కూడా అది ప్రభావితము చేయును. నిజమే, దేవుడు మనకిచ్చిన పనిని నెరవేర్చకుండా అడ్డుకొను వ్యతిరేకమైన వివిధ సవాళ్ళు మనకెదురు కావచ్చు. వాటిలో ప్రాముఖ్యమైనవి సాధారణంగా మన కుటుంబాల నుండియే వచ్చును. కొన్నిసార్లు మన కుటుంబాలలోని బంధాల కట్టుబాట్లు మనలను దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయుటకు అడ్డుగా ఉండును. ఈ దిన వాక్యభాగములో ఇద్దరు వ్యక్తులను దేవుడు పిలిచినప్పుడు వారి కుటుంబాలనే సాకులుగా చూపుటను గూర్చి మనము చదువుదుము. మొదటివాడు, ‘‘మొదట నా తండ్రిని పాతిపెట్టి రానిమ్ము’’ అని చెప్పెను. అలాగే రెండవవాడు, ‘‘మొదట నేను వెళ్ళి నా ఇంటివారికి సెలవుచెప్పి వచ్చుటకు అనుమతినిమ్ము’’ అని చెప్పిరి. ‘‘మొదట’’ అను మాటను చూడండి. వారి మొదటి ప్రాధాన్యత వారి కుటుంబమే కానీ యేసు కాదు !
ప్రియ స్నేహితులారా, ఈ లోక సంబంధాలన్నిటికంటె ప్రభువుకు, ఆయన రాజ్య పరిచర్యకు మన మొదటి ప్రాధాన్యత ఉండవలసియున్నది. లూకా 14:26లో ‘‘ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకంటెవాడు నా శిష్యుడు కానేరడు’’ అని యేసు చెప్పెను. అనగా మన వారిని ద్వేషించి, విడిచిపెట్టి, యేసును వెంబడిరచుమని కాదు గానీ మనమిచ్చు ప్రాధాన్యతయే ముఖ్యమైనది. ఎల్లప్పుడును ప్రభువునే ముందు ఉంచి, ఆ తరువాతనే మన కుటుంబాలు, దీనికి మధ్యలో ఎట్టి లోకానుసారమైన స్వభామును రానియ్యకూడదు. ప్రభువు కొరకు మన మట్టి ఆసక్తి కలిగియున్నప్పుడు ఆయన మన పట్ల మరింతగా ఆసక్తి కలిగి మన కుటుంబ అవసరతలన్నిటిని గూర్చి లక్ష్యముంచెను.
ప్రార్ధన:- పరమ తండ్రీ, నీ నీతిని, రాజ్యమును మొదట వెదకితే మిగిలిన సమస్తము నాకనుగ్రహింప బడునని నీ వాక్యము సెలవిచ్చుచ్నునది గనుక నీ రాజ్య పరిచర్యకు మొదటి స్థానమిచ్చి ఆ తరువాతనే ఈ లోక సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చు కృపనిమ్ము. నీ పని చేయుటలో పూర్ణ హృదయంతో పాల్గొందుటకు సహాయం చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments