తేనెధారలు
నీ గురించి నీవు తగ్గింపు అభిప్రాయము కలిగియుండుము
‘‘ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును’’
(యాకోబు 4:10)
దేవుని ప్రజలు దేవుని సన్నిధిని గుర్తించినప్పుడు ప్రతిస్పందనగా వారు తగ్గించు కొందురు. ఎందుకనగా వారి అయోగ్యతను, బలహీనతను, నిస్సహాయతను పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట చూచుకొందురు. కఠిన హృదయులు మాత్రమే దేవుని సన్నిధిలో గర్వముగా ప్రవర్తించుదురు ! దైవజనులు దేవుని ఎదుట ఎలా తగ్గించుకొనిరో బైబిలులో అనేక సంఘటనలు వ్రాయబడియున్నది. యెషయా 6 అ.లో పరిశుద్ధ దూతలు సహితము దేవుని సన్నిధిలో వారి ముఖములు కప్పుకొనినట్లు మనము చదువుదుము. దైవదర్శనము చూచిన యెషయా ఎంతో కలవరపడి తన పాపస్థితిని వెనువెంటనే గ్రహించగలిగెను. (యెషయా 6:1-5). ఈ సృష్టిలోని అద్భుతాలను దేవుడు యోబుకు చూపినప్పుడు ఇక ఏ మాత్రము అతడు దేవునితో వాదింపక ‘‘నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను’’ అని ఎంతో వినయముతో చెప్పెను. (యోబు 42:6). అపొస్తలుడైన యోహాను ప్రభువైన యేసుకు ఎంతో సమీపంగాను ఆయన రొమ్ముపై ఆనుకొని ఉండినవాడు, అతడు ఆయన మహిమను పత్మాసు ద్వీపమందు చూచినప్పుడు చచ్చినవానివలె ఆయన పాదాలమీద పడెను (ప్రక 1:17)
ప్రియ మిత్రులారా, మనము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుండవలెనని ఎప్పటికప్పుడు మనము జ్ఞాపకము చేసికొనుట మంచిది. దేవుని వాక్యమందు గట్టిగా చెప్పబడిన ఒక మాట ఏదనగా అహంకారులను దేవుడు ఎదిరించును, గనుక జాగ్రత్త కలిగియుందము. మన శరీరం మీద ఆధారపడితే మనలను మనము తగ్గించుకొనలేము అని గుర్తించండి. కానీ మనలో ఉన్న క్రీస్తు యొక్క ఆత్మ మనలను మనము తగ్గించుకొనుటకు శక్తినిచ్చి దానితోపాటు దేవుని ఈ ఆజ్ఞకు లోబడుటకు అసాధారణమైన శక్తి ననుగ్రహించును. అయితే, మొత్తానికి మనంతట మనము అలా తగ్గింపబడుటకు తీర్మానించుకొనవలసిన అవసరమున్నది.
ప్రార్ధన :-సర్వశక్తిమంతుడనైన ప్రభువా, నన్ను దీనునిగా చేసి ఆ విధంగానే కొనసాగుచు మరింతగా నీ ముఖ దర్శనము చేసి మరింతగా నేను తగ్గించుకొను కృపనిమ్ము. నా పాపస్థితికి కనుగొని నా సమస్తము నీకు లోబరచి, సంపూర్ణంగా తగ్గించుకొని నీ ఎదుట సాగిలపడుటకు సహాయము చేయుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comentarios