top of page

05, నవంబర్ 2024 మంగళవారము || తేనెధారలు

చదువుము : యోబు 1:6-12


దేవుడు కొన్నిసార్లు ఆత్మీయ పోరాటము ననుమతించును

‘‘మనము పోరాడునది శరీరులతో కాదు, గాని... అధికారులతోను... ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను... పోరాడుచున్నాము’’ (ఎఫెసి 6:12)

సాతాను యొక్క పోరాటమును గూర్చి మూడు విషయాలు మనము తెలిసికొనవలసి యున్నది. మొదటిది, అది దేవునిచే అనుమతించబడినది. యోబు గ్రంథమును చూచినట్లయితే సాతాను యోబును శ్రమపరచుటకు దేవుని అనుమతి పొందుటకు ఆయన ఎదుట రావలసివచ్చెను. యోబు తన కుటుంబము, ఇల్లు, సంపద, ఆరోగ్యము, సమస్తమును కోల్పోయెను. ఆ శ్రమ ద్వారా దేవుడేమి చేయదలచెనో అది యోబు గ్రంథ ముగింపులో మాత్రమే మనము తెలిసికొందుము, అయితే అది యోబు కన్నులకు ఆ క్షణము మరుగుపరచబడెను. అలాగే, మన కన్నులకును మరుగుపరచబడెను. మన శ్రమ వెనుక అపవాది యొక్కయు, దయ్యపు శక్తుల యొక్కయు దుర్మార్గత పనిచేయుచుండును. రెండవది, మనకు శిక్షణనిచ్చుటకే దీనిని దేవుడు అనుమతించును. వ్యతిరేకత దేవుడు మనకు శిక్షణనిచ్చు విధానమైయున్నది. శ్రమ, హింస, బాధ మరియు హృదయ వేదన ఇవన్నియు (కొన్నిసార్లు) మన దృష్టిని ఆయనవైపు మరల్చుకొను దేవుని విధానాలైయున్నవి. మన సమస్యలను అధిగమించి లేవనెత్తబడుటకు ఆయన మనకు చెప్పినదేమో మనమాలకించవలెనని ఆయన కోరుచున్నాడు. మనలో అనేకులిట్టి పరిస్థితులలో నుండి నడిచినవారే. గొప్ప హృదయవేదననుభవించు వరకు మనము దేవునివైపు కొద్దిగానైనను దృష్టి మరల్చము. మూడవది, మనలను క్రీస్తులో పరిపూర్ణులుగా చేయుటకు దేవుడు శ్రమననుమతించును. పరిపూర్ణత అనగా సమస్తము దేవుని చేతిలోనే ఉన్నదనియు, మనము గ్రహించలేని విధంగా ఆయన ఉద్దేశములను నెరవేర్చుచున్నాడని మనము గ్రహించి, దానినంగీకరించుటకు ఇష్టపడుటయే. దేవునియందు నమ్మిక యుంచుటకు నేర్చుకొనుట కూడా పరిపూర్ణత.


	కావున ప్రియ మిత్రులారా, మనము సాతాను పోరాటము నెదుర్కొనునప్పుడు విసిగిపోక అది మన విశ్వాసమును బలపరచి ఈ చిక్కుల లోకంలో మనము ఆత్మీయ స్థిరత్వము కలిగియుండునట్లు చేయునట్లు ప్రార్థించుదము.

ప్రార్ధన:- ప్రియ ప్రభువా, ఆత్మీయంగా బలపడి, స్థిరపడి, మరెక్కువ పరిపూర్ణులగునట్లు మమ్ము తర్ఫీదు చేయుటకే సాతాను పోరాటమును నాకు అనుమతించుదువని నేను గ్రహించు కృపనిమ్ము. శ్రమలో నీవు నాకేమి బోధించుచున్నావో ఆలకించి, అలయక సమస్తము నీ అధీనంలోనే ఉన్నదని, నన్ను గెలిపించుదువని నమ్ముచు యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.com

Komentar

Dinilai 0 dari 5 bintang.
Belum ada penilaian

Tambahkan penilaian
bottom of page