top of page

03, నవంబర్ 2024 ఆదివారము || తేనెధారలు

చదువుము : యెహోషువ 14:6-15


కాలేబునకుండిన ఆత్మ కలిగియుండుము

‘‘విశ్వాసము లేకుండా దేవుని ఇష్టుడైయుండుట అసాధ్యము’’ (హెబ్రీ 11:6)

కాలేబు తన స్వభావమును తెలుపు అనేక గుణగనాలను కలిగినవాడు. మొదట, అతనికి అచంచలమైన గొప్ప విశ్వాసముండెను. ఎందుకనగా అతడు పదిమంది వేగులవారు చెప్పిన చెడ్డ సమాచారమును నమ్మిన వారి వ్యతిరేకత నుండి రేగిన గొప్ప అలల చేత చుట్టబడియుండెను. కాలేబు యొక్క విశ్వాసము దేవుని వాక్య ఆధారముగా ఉండెను. యెహోషువాకు తాను విన్నవించుకొనిన మాటలలో చాలాసార్లు దేవుని వాక్యమును ఉటంకించెను. ‘‘యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు’’ అని యెహోషువ 14:10లో అతడు చెప్పియున్నాడు. 12వ వచనంలో ‘‘కాబట్టి ఆ దినము యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము... యెహోవా నాకు తోడైయుండిన యెడల ఆయన సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును’’ అనియు అతడు చెప్పియున్నాడు. పంపబడిన ఆ పదిమంది వేగులవారు అక్కడుండిన ఉన్నత దేహులతో పోల్చుకొని వారి శక్తిని అంచనా వేసికొనిరి గానీ, వారితోనే వెళ్ళిన యెహోషువ, కాలేబులు ఇద్దరు మాత్రము అక్కడున్న వారి బలమును దేవుని బలముతో లెక్కకట్టిరి. ప్రాకారములు గల గొప్ప పట్టణాలలో నున్న ఆ ఉన్నత దేహులకంటె దేవుడే గొప్పవాడు అని వారు నమ్మిరి. రెండవది, కాలేబు దేవుని శక్తియందు విశ్వసించెను. గతములో దేవుని మహాశక్తిని ఎంతగానో చూచి సాక్షిjైుయుండెను. ఎఱ్ఱ సముద్రము చీల్చబడి తోడివారందరితో కలసి ఆరిన నేలను నడిచి వెళ్ళిరి. అరణ్యములో మన్నాను భుజించెను. బండనుండి నీరు ఉబికి రావడము మరి అనేక అద్భుతాలు అతడు చూచియుండెను. దేవుడు అతనితో ఉంటే అతనికి విరోధులెవరును ఉండరు అని అతడెరిగియుండెను.


		ప్రియ స్నేహితులారా, కాలేబులో ఉండిన ఆత్మను మనము కలిగియుందము. మన చుట్టు విరోధమైన పరిస్థితులెన్ని ఉన్నను దేవుడు ఇచ్చిన వాగ్ధానాలమీద పూర్తిగా నమ్మికయుంచుదుము. వాగ్ధానము చేసిన దేవుడు మనలనెన్నడు విడనాడడు.
ప్రార్ధన:- నమ్మకమైన దేవా, నా అననుకూల పరిస్థితులను చూడక నీ వాగ్ధానము యందే నా విశ్వాసమును ఉంచు కృపనిమ్ము. గతములో నా జీవితములో నీ శక్తిని రుచి చూచితిని. అలాగే నిన్న, నేడు, నిరంతరము నీవు ఏకరీతిగా ఉన్నవాడవని, వాగ్ధానము చేసిన నీవు దాన్ని నెరవేర్చగల నమ్మదగినవాడవని నమ్ముచు యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page