01, ఏప్రిల్ 2025 మంగళవారము || దేవుని సమాధానము మన మనస్సులకు కావలియుండును
- Honey Drops for Every Soul
- Apr 1
- 1 min read
తేనెధారలు చదువుము : ఫిలిప్పీ 4:4-19, 12
‘‘అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును’’ - ఫిలిప్పీ పత్రిక 4:7
ఎల్లవేళల మన మనస్సుకు ఒక కావలి అవసరమైయున్నది. లేకపోతే మనకు క్రీస్తు అనుగ్రహించు సమాధానము కోల్పోవుదుము. మొదట, అనుమానము రాకుండా మన మనసుకు కాపుదల అవసరమని డా॥ కాల్విన్. ఎల్. బ్రెమర్ వ్రాస్తున్నారు. విరోధమైన, కఠినమైన ఈ లోకంలో మనకెదురయ్యే ప్రతి ఒక్కరిని అనుమానించకుండా మనము కాచుకొనవలసియున్నది. విశాల హృదయంతోను, కపటములేని మనసుతో మనముండ వలెనను ఆశ కలిగియుండవలెను. రెండవదిగా, శోధనలకు గురికాకుండా మన మనసుకు కాపుదల ఉండవలెను. వివిధ రకాలైన వస్తువులు, కార్లు, ఇళ్ళు మొ॥ వాటిని గూర్చి మాద్యమాలలో ప్రకటనల ద్వారా అవి మనలను శోధించి దురాశకు గురిచేయును. మన ధనమును వృద్ధి చేయునని ఆకర్షణీయమైన స్కీములు హానికరముగా కనబడనప్పటికిని, క్రమేణ అవి మనలను ఈ లోకపరమైన వంకర త్రోవలలోనికి నడిపించును. అయితే, పాపిjైున ఒక మనిషి యొక్క వాంఛలు, అతని నేత్రాశ, జీవపు డంబము అవి తండ్రి వద్దనుండి రావు గానీ లోకమునుండియే కలుగునవి. (1 యోహాను 2:16).
మూడవదిగా, కలవరము, ఒత్తిడికి గురికాకుండా కాపుదల అవసరము. కొన్నిసార్లు భవిష్యత్తులో ఏదో జరగరానిది జరుగునేమోయని తలంచుచుందుము. అయితే, ప్రార్థనలో మనలను, మన భవిష్యత్తును దేవునికి అప్పగించుకొంటే దేవుడనుగ్రహించు సమాధానము మన మనస్సులను కావలియుండును. గర్వము, అసూయ, పగ, కోపము, వ్యతిరేక తలంపులు మొ॥ మన ఆత్మలను కృంగదీయు చెడ్డ తలంపులు రాకుండా కూడా మన మనస్సులకు కావలి అవసరము. ఇట్టి చెడ్డ తలంపులతో మన మనస్సులు నిండియుంటే మన ప్రభువు మాత్రమే అనుగ్రహించు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మనమనుభవించలేము.
ప్రార్ధన:- సర్వశక్తి గల దేవా, నీ మీదను, పరలోక విషయాల మీదను దృష్టియుంచు కృపనిమ్ము. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొని, క్రీస్తు అనుగ్రహించు సమాధానము నా మనసుకు ఎల్లప్పుడు కావలియుండునట్లు కృప దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments